తెల్లారక ముందే తెల్లారుతున్న బతుకులు
తెల్లారిన బతుకులు
చితికిన లెక్కలేనన్ని బతుకులు అడుగడుగునా విలపిస్తున్నాయి
అభిమానం లేని ఆత్మలు అంగడి సరకులా అమ్ముడుపోతున్నాయి
మద్యం మత్తులో కార్లు బస్సులు రైళ్లు దూసుకుపోతున్నాయి
వలస కూలీల బతుకులు తెల్లారక ముందే తెల్లారి పోతున్నాయి
దూతలు దిగొచ్చి వారి దేహాలకు అత్తర్లు పూస్తారు
ఏ పసి మొగ్గలైతే రైలు డబ్బాల్లో చెత్త ఊడుస్తుంటారో
కూడు గూడు గుడ్డ అన్న పదాలు నేటికీ చేతిలో పట్టుకొని
ప్రశిస్తున్నారు మేతావుల్ని రేపటి భారత భాగ్య విధాతలు
పిల్లల ఫీజులు, వారి పుస్తకాలు, పెన్నులు
పేద కళ్లలో పాఠశాల గుచ్చుకుంటూనే ఉంది
పచ్చని పొలాల్లో పేదరికం పండటం మొదలు
హలం హాలాహలమై పొలం గట్టునే పాగవేసింది
మార్గమధ్యంలో ఒక మృతదేహం పక్కనే వ్రాసి ఉంది
విషపూరితమైన రొట్టె కూడా ఆకలిలో తీపిగా అనిపిస్తుంది
ఆకలి బతుకులు తెల్లారక ముందే తెల్లారుతున్నాయి
అట్టహాస ఆడంబరులు వజ్రంతో గొంతు కోసుకుంటున్నారు
దూరం జరగండి కన్నీళ్లు తుడుచుకోండి
అటు చూడండి రైలు బండి వస్తున్నది
నేను మిమ్మల్ని వీడి వెళ్ళేవాడినే కాను
కానీ, పేదరికం నన్ను లాక్కెళుతున్నది
పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ

Comments
Post a Comment