చిరునవ్వు
శీర్షిక: నిర్మాణానికి నిచ్చెన నవ్వు
మానవ తోటలో మందస్మిత మందారాలు పూయించండి,
సప్త రంగుల హరివిల్లయి హాస్య మాలికలను ఆహ్వానించండి
మహనీయ ముహమ్మద్ (స) మందస్మిత ప్రియులు
“చిరునవ్వు కూడా పుణ్యకార్యమే” అని ప్రబోధించిన ఘనులు
పసికూనల్ని పచ్చని నవ్వుతో పలుకరించండి
దాని మధుర ఫలం పరలోకంలో దక్కునని గ్రహించండి
చిరుజల్లుతో తూరుపుతామర విరబూస్తుంది
చిరునవ్వుతో మనస్సు తమస్సు వైదొలుగుతుంది
అనాధల, వితంతుల, వికలాంగులను అక్కున చేర్చుకోండి
బడుగు బలహీనుల బతుకులు బజారు పాలు కాకుండా ఆదుకోండి
విరుపును అరువివ్వండి విచారాల తరువును తొలగించండి
విశ్వవిధాత సయితం హర్షించేలా విశ్వప్రాణుల్ని ప్రేమించండి
మతోన్మాదుల్ని మృగోన్మాదుల్ని మందహాస మహాస్త్రాలతో నిర్మూలించండి
మానవ నిర్మాతలయి సౌజన్య ప్రదాతలయి సౌమనస్యాన్ని స్థాపించండి
నవ్వే నాకలోకానికి మార్గం చిరునవ్వే నరకాగ్నిని ఆర్పే జీవ జలం
హలం బలం ఎంతున్నా హాస్యం లేకుంటే జీవితం హాలాహలం
మందహాసం మహాత్ముల విశేష లక్షణం,
అది మానవ శ్రేయోదయానికి మూలాంకురం
చచ్చేనాటికి చిరునవ్వు మన ముఖం మీద ఉండాలి
చచ్చేటంతటి ప్రేమతో జనం కన్నీటి వీడ్కోలు పలకాలి
పేరు: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ

Comments
Post a Comment